జననినాదం, బెల్లంపల్లి 12
ఆయనకు కూతురు అంటే పంచ ప్రాణం. భార్యతో గొడవపడి ఏడాదికాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. కూతురును చూడాలని ఎంత ప్రయత్నించినా భార్య అవకాశం ఇవ్వలేదు. కూతురును చూపించాలంటూ చివరకు భార్యతో గొడవ కూడా పడ్డాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాంతో కూతురిపై మమకారాన్ని చంపుకోలేని ఆ తండ్రి చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. టేకుల బస్తీకి చెందిన బొల్లి సుమిత్ చంద్ర, బూడిదగడ్డ బస్తీకి చెందిన వెంగళ శిరీష 2001 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది కాలంలో వీరికి ఓ పాప జన్మించింది. సాఫీగా జరిగిన వీరి సంసారంలో కలహాలు తలెత్తాయి. అనతి కాలంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరిపోయి దూరంగా ఉంటున్నారు. శిరీష భర్త పై 2003లో బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశారు. అప్పటి నుండి సుమిత్ చంద్ర, శిరీష కోర్టు వాయిదాలకు వెళ్తున్నారు. సుమిత్ చంద్రకు రెండేళ్లుగా కూతురును చూసే అవకాశం లేకుండా పోయింది. ఎప్పటి లాగానే గురువారం కోర్టు వాయిదాకి వచ్చిన సుమిత్ చంద్ర బిడ్డను చూపించాలని అత్తగారింటికి బూడిదిగడ్డ బస్తీకి వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. భర్త సుమిత్ చంద్ర కొట్టాడని పోలీసులకు చెప్పింది. దీంతో సుమిత్ ను పోలీసులు మందలించి పంపించారు. కూతుర్ని చూపించకుండా తనపై తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసుల తోటి తిట్టించిందని మనస్థాపానికి గురయ్యాడు. అప్పటికే వెంట తెచ్చుకున్న హెయిర్ డ్రైని తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ ముందే తాగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. వెంటనే పోలీసులు అతన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.