
- శోభాయమానంగా హనుమాన్ దీక్ష స్వాముల శోభాయాత్ర
- తలండి నుండి పెర్కపల్లి, చింతపల్లి గ్రామాల మీదుగా సాగిన యాత్ర
- పల్లె పల్లెనా శోభిల్లిన ఆధ్యాత్మిక వాతావరణం
- భక్తి పాటలకు దరువేసిన హనుమాన్ దీక్ష స్వాములు
జననినాదం, తిర్యాణి 08:
‘జై శ్రీరామ్.. జై హనుమాన్..’ ఆదివాసీ పల్లెల్లో మారుమోగిన భక్తి పారవశ్య నినాదాలివి. పులకించిన తన్మయత్వం.. ఉప్పొంగిన భక్తి ప్రపత్తులు వెరసీ పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపంచింది. కొత్త రూపు దాల్చింది. అత్యంత వైభవోపేతంగా.. ఎల్లడెలా పురివిప్పిన దైవ నామస్మరణ హనుమాన్ దీక్ష స్వాములను దరువేసేలా పురిగొల్పింది. పవిత్ర దీక్ష సమయంలో చేపట్టిన సామూహిక శోభాయాత్ర శోభాయమానంగా సాగితే.. చూపరుల హృదయాలు ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలాయి. భక్తి పాటలు పరవశానికి గురి చేస్తే.. లయబద్ధమైన చిందులు శోభాయాత్రకు వన్నె తెచ్చాయి. అపురూపంగా.. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన హనుమాన్ దీక్ష స్వాములు తరించిన శోభాయాత్ర తీరుతెన్నుల సారమే ఇది…
తిర్యాణి మండలంలో మంగళవారం హనుమాన్ దీక్ష స్వాముల శోభాయాత్ర దిక్కులన్నీ పిక్కటిల్లేలా మారుమోగింది. డీజే బాక్సులు.. సుందరంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో శ్రీ సీతారాములు, లక్ష్మణ, హనుమాన్ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా సాగాయి. మండలంలోని తలండి గ్రామంలో సాయంకాలం వేళ వైభవంగా మొదలైంది శోభాయాత్ర. హనుమాన్ దీక్ష స్వాములు యాత్రకు అగ్రభాగాన సాగితే.. సాధారణ ప్రజానీకం యాత్రలో పాలుపంచుకుంది. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్..’ నినాదాలు యాత్రలో హోరెత్తితే.. భక్తి గీతాలు మరింత పులకింపజేశాయి. తలండి నుండి హృద్యంగా మొదలై.. పెర్కపల్లి, నాయకపుగూడ, తిర్యాణి, భీమారం, చింతపల్లి మీదుగా శోభయాత్ర శోభాయమానంగా సాగింది.’జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీస తిహు లోక ఉజాఘర.. రామదూత అతులిత బలధామా.. అంజనీపుత్ర పవనసుత నామా..’ అంటూ హనుమాన్ చాలీసా పారాయణం ఓ వైపు.. శ్రీ రామ నామస్మరణ మరో వైపు శోభాయాత్రకు కొత్త వన్నె సంతరింపజేశాయి. హనుమాన్ దీక్ష గురు స్వాములైన పూసబెర్ల లచ్చన్న, రంగు అంజయ్య, వెన్న సంతోష్, కుంరం రాజు, యాంసాని భాస్కర్, జుంగోని అశోక్, యాంసాని రాజు, బోర్లకుంట మహేష్, బొట్ల పోషమల్లు యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. కన్నె స్వాములు కనువిందు చేశారు. సంధ్యా సమయాన ఆరంభమై.. రాత్రి వరకు వైభవోపేతంగా యాత్ర సాగడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో యాత్రను తిలకించేందుకు తరలి వచ్చారు.

Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.