వికసించిన విజ్ఞానపు భాండాగారం..!

- తిర్యాణిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం
- లాంఛనంగా ప్రారంభించిన ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్
- కష్టపడాలి.. ఉద్యోగ అవకాశాల్ని మెరుగు పరుచుకోవాలని సూచన
- గ్రంథాలయాలు మానవ విజ్ఞాన సంపదకు నిలయాలని వెల్లడి
- మారుమూల ప్రాంతంలో గ్రంథాలయం ఏర్పాటుతో ఆదివాసీల్లో ఆనందపు వెల్లువ
- పాత పోలీస్ స్టేషన్ ను గ్రంథాలయంగా మార్చిన ఎస్సై శ్రీకాంత్ కు అభినందనల సత్కారం
జన నినాదం, తిర్యాణి 03: ఒకప్పుడు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన తిర్యాణి ప్రాంతం నేడు విజ్ఞానపు భాండాగారంతో విరాజిల్లుతోందని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. కష్టపడి చదివి, ఉద్యోగ అవకాశాల్ని మెరుగు పరుచుకోవాలని యువతకు, ఆదివాసీలకు ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని తిర్యాణి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని శనివారం ఏఎస్పీ చిత్తరంజన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలనే సదుద్దేశంతో తిర్యాణి పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని లైబ్రరీగా మార్చడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగానే పాత పోలీస్ స్టేషన్ కు మరమ్మత్తులు చేసి రంగులు వేసి ఫర్నిచర్, పుస్తకాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా గ్రంథాలయంలో తాగునీటి వసతితో పాటు మూత్రశాలలు మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దామని ఏఎస్పీ చిత్తరంజన్ వివరించారు. దాదాపు 200 పుస్తకాలతో ప్రారంభమైన ఈ లైబ్రరీలో కాంపిటీటివ్ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం(పర్సనాలిటీ డెవలప్మెంట్), దేశభక్తి, నైతికత, ప్రేరణాత్మక రచనలు అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసి విద్యార్థులు,యువత ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగ అవకాశాల్లో మెరుగుపడాలనే సదుద్దేశంతో పాత పోలీస్ స్టేషన్ ను గ్రంథాలయంగా మార్చడం జరిగిందని అన్నారు. గ్రంథాలయం మానవ విజ్ఞాన సంపదకు నిలయమని, తిర్యాణి పరిసర ప్రాంత పాఠశాల, కళాశాల విద్యార్థులకు, పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు, పాఠకులకు, యువత, ప్రజలకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. పుస్తకాలను ప్రేమిస్తేనే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని, పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో బాంబులతో దద్దరిల్లిన తిర్యాణి ప్రాంతం నేడు విజ్ఞాన భాండాగారంతో విరాజిల్లేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం పట్ల ఏఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో మాత్రమే కాకుండా ప్రజలకు మేలు జరిగే విషయాల్లో కూడా జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని అన్నారు. ఈ గ్రంథాలయం ఏర్పాటులో కృషి చేసిన సిఐ బుద్దె స్వామి, ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, స్థానికులను ఏఎస్పీ అభినందించారు. సీఐ బుద్దే స్వామి మాట్లాడుతూ తిర్యాణిలో యువతకు మార్గనిర్దేశం చేయాలంటే చదువే ప్రధాన మార్గమని, ఈ లైబ్రరీ ఒక శాంతి సందేశంగా నిలుస్తుంది” అని అన్నారు. ఎస్సై ఎంబడి శ్రీకాంత్ మాట్లాడుతూ.. “గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు కాదు, అది యువత ఆశలు, కలలు, మార్పుకు నాంది” అని కొనియాడారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మాట్లాడుతూ ‘తిర్యాణి ప్రాంతంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం తమకే ఎంతో సంతోషంగా ఉందని’ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ బుద్దె స్వామి, తిర్యాణి ఎస్సై ఎంబడి శ్రీకాంత్, ఆదివాసి సంఘాల నాయకులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.